Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. నిరుటితో పోల్చితే క్రైం రేటు 22.5 శాతం, లైంగికదాడి ఘటనలు 28.94 శాతం పెరిగాయి..మొత్తంగా 2,945 కేసులు నమోదుకాగా, ఇందులో 82 శాతం బాలికలపై అఘాయిత్యాల ఘటనలే ఉండటం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమని ఆదివారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. అంబర్‌పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్యకు గురై నాలుగు నెలలు దాటినా కేసు పరిష్కారంకాలేదని, ఆరు నెలల క్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి కేసులో కూడా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని 8వ పేజీలోమండిపడ్డారు. ఘోర నేరాల్లో బాధితులకు న్యాయం దక్కకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణలో 163కు పైగా ప్రధాన కేసులు పరిష్కారం కాకపోవడం, రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగకపోవడం సర్కారు అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు 31 శాతం ఉన్నదని, బీహార్ లాంటి రాష్ట్రంతో పో టీపడే పరిస్థితి రావడం దురదృష్టకరమ ని, ఘటన జరిగిన మొదటి వారమైన గోల్డెన్ పీరియడ్‌ను వృథా చేయడంవల్లే బాధితులకు న్యాయం దక్కడంలేదని అ భిప్రాయపడ్డారు.
వివిధ కేసుల్లో నిందితులు యథేచ్ఛగా తిరగడం చూస్తే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని దెప్పిపొడిచారు. సీఎం రేవంత్ పాలనా వైఫల్యంతో తెలంగాణ పోలీసు లు నైపుణ్యాలు, శక్తిని కోల్పోతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడానికి హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వైఫల్యమే కారణమని విమర్శించారు. ప్రజాభద్రతను గాలికొదిలిసిన ప్రభుత్వ పెద్దలు రాజకీయ దా డులకు పాల్పడటం దుర్మార్గమని, ప్రశ్ని స్తే కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకుంటే వేధించ డం ఈ ప్రభుత్వానికి రివాజుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆఖరికి పేరు మరిచిపోతే కూడా కేసులు పెడు తూ ఇబ్బందిపెట్టడం ఈ సర్కారుకే చె ల్లిందని ఎద్దేవాచేశారు. ప్రభుత్వ పెద్దలు పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోకుండా ప్రజాభద్రతకు వినియోగించాలని చురకలంటించారు. మెరుగైన శాంతిభద్రతల నిర్వహణకు పోలీసుశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.