Indiramma Housing Scheme | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల మాదిరిగానే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం అరకొరగా అమలుచేసి మమ అనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 82 లక్షల దరఖాస్తులను వడపోసి తొలి విడత అర్హుల జాబితాలో 18 లక్షల మంది దరఖాస్తుదారులను మాత్రమే చేర్చడం ఇందుకు నిదర్శనం. అందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు.. పథకం అమలు విషయానికి వచ్చేసరికి రకరకాల నిబంధనలతో చాలామంది దరఖాస్తుదారులను అనర్హుల జాబితాలో చేర్చి చేతులు దులుపుకుంటున్నది. అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కాకుండా ఆధార్, పాన్ కార్డులను, బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిగణనలోకి తీసుకొని వాటిని అన్ని కోణాల్లో విశ్లేషించింది. దరఖాస్తుదారులు చెల్లిస్తున్న ఇంటి అద్దెలు, కారు లోన్లు, ఇతరత్రా గృహోపకరణాల లోన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. కార్లు, ద్రిచక్ర వాహనాలు ఉన్నవారిని ఇండ్లకు అనర్హులుగా తేల్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు బతిమిలాడి మరీ క్రెడిట్ కార్డులు అంటగడుతున్నాయి. ఏ వస్తువు కొందామన్నా వాయిదాల పద్ధతిలో దొరుకుతున్నాయి. సొంతిల్లు, ఇంటి జాగా లేనివారు సైతం అప్పుచేసి అనేకరకాల గృహోపకరణాలను కొనుక్కుంటున్నారు. వారిలో చాలామంది ఆ అప్పులను తీర్చడంలో విఫరమవుతున్నారు. ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలన్నీ అనుసంధానమై ఉండడంతో ఆస్తులేమీ లేకున్నప్పటికీ బ్యాంకు లావాదేవీలను బట్టి ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నట్టు అధికారులు గుర్తిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల్ల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా ఖరీదైన ద్విచక్ర వాహనం ఉన్నవారిని కూడా అనర్హులుగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు జాబ్ చేస్తు న్నవారిని కూడా అనర్హులుగా తేల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు 82,82,332
పరిశీలన తరువాత మిగిలిన దరఖాస్తులు 77.18 లక్షలు
జాగా ఉండి ఇల్లు లేనివారు, కచ్చా ఇల్లు ఉన్నవారు (ఎల్-1) 18.67 లక్షల మంది
జాగా, ఇల్లు రెండూ లేకుండా అద్దె ఇంట్లో ఉన్నవారు (ఎల్-2) 17.36 లక్షల మంది
బ్యాంకు ఖాతాల ఆధారంగా సంపన్నులుగా తేలినవారు (ఎల్-3) 41.15 లక్షల మంది
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు
ఇప్పటివరకు మంజూరు చేసినవి 72,045
ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చేది రూ.5 లక్షలు
పథకాన్ని ప్రారంభించిన తేదీ 2024 మార్చి 11
ఇప్పటివరకు నిర్మించిన ఇండ్లు 0
రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు
ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర వాణిజ్యం నిర్వహించేవారు
నెలవారీగా రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు
రిఫ్రిజిరేటర్, ల్యాండ్‌లైన్ ఫోను, 2.5 ఎకరాల కన్నా ఎక్కువ సాగుభూమి ఉన్నవారు
భూమి లేని, ఇల్లు లేని కుటుంబాలు
ఒకటి, లేక రెండు గదులున్న కచ్చా ఇల్లు ఉన్నవారు. ఇంటి పైకప్పు కాంక్రీట్‌తో లేనివారు
పర్మినెంట్ ఉద్యోగం లేనివారు.
రోజువారీ కూలీలు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులకు ప్రాధాన్యం
ఆధార్ నంబర్‌తోపాటు సెల్ఫ్
అటెస్టెడ్ ఆధార్ కార్డు. ఒకవేళ దరఖాస్తుదారులు నిరక్షరాస్యులైతే వేలిముద్రతో కూడిన కన్సెంట్ లెటర్ తప్పనిసరి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు
బ్యాంకు ఖాతా వివరాలు (ఓరిజినల్, డూప్లికేట్)
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) నంబర్ (మరుగుదొడ్డి కోసం నమోదు చేసుకున్న వివరాలు)