హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపలేదు. ఎప్సెట్ రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఈ కాలేజీలో 80% సీట్లు ఖాళీగా ఉన్నాయి. కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్లో 198 సీట్లుండగా, కేవలం 41 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు దక్కించుకున్నారు. 157 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. మొదటి విడత కౌన్సెలింగ్లో 48.2% సీట్లు భర్తీ అయ్యాయి.
101 మంది చేరగా, రెండో విడత కౌన్సెలింగ్కు వచ్చే సరికి 41 మందికే పరిమితమయ్యింది. 2024లో 84 మంది చేరగా, ఈ సారి 41మంది చేరారు. ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ రెండో విడత సీట్లను మంగళవారం కేటాయించారు. 91,495 సీట్లకు 83,521 సీట్లు(91.2%) భర్తీకాగా, 7,974 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండో విడతలో 23,509 సీట్లు భర్తీకాగా, 21,402 మంది ైస్లెడింగ్ విధానంలో సీట్లు మార్చుకున్నారు. యూనివర్సిటీల్లో 79.7%, ప్రైవేట్ కాలేజీల్లో 92.1% సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు ఆగస్టు 1లోగా ఫీజు చెల్లించాలని, 2 లోగా కాలేజీల్లో రిపోర్ట్చేయాలని అధికారులు సూచించారు.