Bhadrachalam | భద్రాచలంలో కిడ్నాప్ అయిన బాలుడిని రాజమహేంద్రవరంలో అమ్మేశారు. ఈ కేసును భద్రాచలం టౌన్ పోలీసులు ఛేదించారు. భద్రాచలం ఏఎస్సీ రోహిత్ రాజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
భద్రాచలం పట్టణంలో ఓ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న 8 ఏండ్ల బాలుడు ఈ నెల 6వ తేదీన కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాలుడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక స్కూల్ నుంచి ఇంటి వరకు ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. భద్రాచలంలోని అశోక్‌నగర్‌కు చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె కుమార్తె అనూష కుమారుడు సాయిరాం కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో కందుల అన్నపూర్ణ కుటుంబంపై పోలీసులు నిఘా ఉంచారు. వారిని విచారణ చేయగా, బాలుడిని రాజమహేంద్రవరానికి చెందిన స్నేహలత, ఇషాక్ గున్నం దంపతులకు మధ్యవర్తి బీ తులసి ద్వారా రూ. 4.5 లక్షలకు అమ్మినట్లు గుర్తించారు. ఈ సమాచారంతో స్నేహలత దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మధ్యవర్తి రూ. 50 వేలు తీసుకున్నారు. మిగతా రూ. 3.10 లక్షల నగదును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 6 మొబైల్స్‌ను సీజ్ చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చైల్డ్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో అతని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.