రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు
హైదరాబాద్, మార్చి 7 : ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు ముందునుంచే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు ప్రభుత్వం ఏడున్నర ఏండ్లలోనే 12 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మొదటి విడతగా మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో 4 కాలేజీలను ప్రారంభించింది. అదనంగా 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది.
4 సూపర్ దవాఖానలకు వెయ్యి కోట్లు
అందుబాటులోకి 4 వేల పడకలు
హైదరాబాద్ నలుదిక్కులా నిర్మించబోయే 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానల కోసం బడ్జెట్లో సర్కారు రూ.1,000 కోట్లు కేటాయించింది. టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కులా.. గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డ (సనత్‌నగర్)లో సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి దవాఖానలో వెయ్యి చొప్పున 4 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలోని పేదలకు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోనున్నది. త్వరలో సీఎం కేసీఆర్ వీటికి శంకుస్థాపన చేయనున్నారు.
నిమ్స్‌లో మరో 2 వేల పడకలు
3,489కి పెరుగనున్న బెడ్స్
హైదరాబాద్‌లోని నిమ్స్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నిమ్స్‌లో 1,489 పడకలు అందుబాటులో ఉండగా, మరో 2 వేల పడకలు పెంచనున్నది. ప్రస్తుతం నిమ్స్‌లో రోజూ సగటున 1,800-2,000 ఓపీ నమోదవుతున్నది. 1,200 మందికిపైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మరోవైపు నిమ్స్‌లో విభాగాల సంఖ్యను 42కు పెంచుతున్నారు. దీంతో అదనంగా పడకలు అవసరం కానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2 వేల పడకలను మంజూరు చేసింది. ఎర్రమంజిల్‌లో నిమ్స్ పక్కనే ఉన్న స్థలంలో భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది పూర్తయితే నిమ్స్‌లో పేదలకు 3,489 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
రోగుల సహాయకులకు భోజనం
హైదరాబాద్‌లోని 18 మేజర్ దవాఖానల్లో రోగుల సహాయకులకు రెండు పూటలా భోజనం అందించనున్నట్టు బడ్జెట్లో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో రోజూ సుమారు 18,600 మందికి ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం ఏటా రూ.38.66 కోట్లు ఖర్చవుతాయి. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు చికిత్సతోపాటు పోషకాహారాన్ని అందించాలని, ఇందుకోసం డైట్ చార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడానికి, సాధారణ రోగులకు డైట్ చార్జీలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏటా రూ.43.5 కోట్లు ఖర్చు చేయనున్నది. దవాఖానల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచేందుకు ఒక్కో బెడ్‌కు పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి ఏటా ఇచ్చే వేతనాలు పెంచాలని నిర్ణయించింది.