హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖ చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కేవలం 50 రోజుల వ్యవధిలో 936 వాహనాల నుంచి జరిమానాల ద్వారా సుమారు రూ. 8.72 కోట్లు వసూలు చేసింది.
ఫిట్నెస్ లేని బస్సులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై జూన్ 1 నుంచి రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. నిబంధనల మేరకు చెల్లించాల్సిన రుసుము కింద మరో రూ. 9.65 లక్షలు వసూలు చేశారు. అత్యధికంగా హైదరాబాద్లోనే 63 వాహనాలకు జరిమానా విధించగా, సుమారు రూ. కోటిన్నర ఆదాయం చేకూరింది.
మేడ్చల్-మలాజిగిరిలో మరో రూ. కోటిన్నర ఆదాయం వచ్చింది. ఈ జిల్లాల్లో 45 వాహనాలు, కరీంనగర్ 12, నిజామాబాద్ 14, నల్లగొండ 18, వరంగల్ 23, రంగారెడ్డిలో 36 చొప్పున నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సుల నుంచి జరిమానా వసూలు చేశారు.