Indiramma Indlu | హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500-2,000 వరకు ఖర్చవుతున్నది.రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఐదు లక్షలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.కేసీఆర్ ప్రభు త్వం గతంలోనే గరిష్ఠంగా ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి రూ.8.65 లక్షలు ఖర్చుచేయగా, ఇప్పుడు కట్టే ఇండ్లకు ఇంతకన్నా ఎక్కువ మంజూరు చేయాల్సిందిపోయి తగ్గించడం విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల తరువాత లబ్ధిదారుల ఎంపికకు కమిటీలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజనతో కలిపి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తే.. లబ్ధిదారులను కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయాలి. కేంద్రం ఇచ్చేది ఒక్కో యూనిట్‌కు రూ. 1.50లక్షలు- 2.50 లక్షలు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు, ఇండ్లకు పొంతన కరువు
ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి దాదాపు రూ.22,500 కోట్లు అవసరం కాగా, 2024-25 బడ్జెట్లో రూ.7,740 కోట్లు కేటాయించారు. హడ్కో నుంచి మరో రూ.8,000 కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్రం సుమారు రూ.8-10 వేల కోట్లు మంజూరు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా 4.5 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసే వీలవుతుంది.
నిర్మాణ వ్యయం తడిసి మోపెడు
ప్రస్తుతం సిమెంటు ధర బస్తాకి రూ.270-350 వరకు ఉన్నది. స్టీల్ ధర టన్నుకు రూ.60,000-75,000 వరకు ఉన్నది. లేబర్ ఖర్చులు ఒక్క చదరపు అడుగుకి రూ.250-350 వరకు ఉన్నాయి. సుమారు 500 చదరపు అడుగుల వైశాల్యం గల ఇల్లు నిర్మించాలంటే లేబర్ ఖర్చులే రూ.లక్ష వరకు అవుతున్నాయి. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500 చొప్పున లెక్కేసినా 500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటికి రూ.7.5 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారు తన చేతి నుంచి కనీసం రూ.2.5 లక్షల నుంచి మూడు లక్షల వరకు పెట్టుకోక తప్పదు. కేసీఆర్ హయాంలో గ్రామీణ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షలకుపైగా ఖర్చుకాగా, జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్టంగా రూ. 8.65 లక్షల వరకు వెచ్చించారు.