వనపర్తి/ఖమ్మం అర్బన్/ వైరాటౌన్ (కొణిజర్ల), జనవరి 30 : ఫుడ్‌పాయిజన్ కారణంగా శుక్రవారం 78 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో 38 మంది, వనపర్తి జిల్లాలో 40 మంది అస్వస్థతకుగురై దవాఖాన పాలయ్యారు. వివరాలు ఇలా..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు శుక్రవారం అన్నంతోపాటు సాంబార్, కోడిగుడ్డు వడ్డించారు. విద్యార్థులు భోజనం చేసిన కొద్దిసేపటికే కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. హెచ్ఎం కేవీ మురళీకృష్ణ, ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు వారిని ఆటోల్లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.
విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని హెచ్ఎం తెలిపారు. ప్రస్తుతం 18 మంది చికిత్స పొందుతుండగా, మిగతా విద్యార్థులను ఇండ్లకు పంపినట్టు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆర్డీవో నర్సింహారావు, డీఎంహెచ్‌వో రామారావు, డీఈవో చైతన్య జైని, కొణిజర్ల తహసీల్దార్ ఎన్ అరుణ, ఎంపీడీవో వర్ష, ఎంఈవో డీ అబ్రహం విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడు కేవీ మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈవో చైతన్య జైని ఉత్తర్వులు జారీచేశారు.

కాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 40మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరు వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో సాయంత్రం సొరకాయ కూరతోపాటు పప్పు వండారని, అది తిన్న వెంటనే కలుపులో నొప్పి.. వాంతులు రావడం మొదలైందని విద్యార్థినులు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దవాఖానకు వెళ్లి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా బీఆర్ఎస్వీ నేత హేమంత్ ముదిరాజ్ విద్యార్థినులను పరామర్శించడానికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు.