హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు కొండలా పెరిగిపోతుంటే, అభివృద్ధి మాత్రం ఆవగింజంత అయినా కనిపించడం లేదు. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 341 రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.77,118 కోట్ల అప్పులు చేసింది. తెలంగాణ జనాభా సుమారు నాలుగు కోట్ల కాగా, ఒక్కో బిడ్డ తలపై రూ.19,279 అప్పుల భారాన్ని కాంగ్రెస్ సర్కారు పెట్టింది. రేవంత్ సర్కారు సగటున రోజుకు రూ.226 కోట్లు, వారానికి రూ.1,562 కోట్లు, నెలకు రూ.6,780 కోట్ల రుణాలు సేకరిస్తున్నది. ఏడాది పాలన కూడా పూర్తికాకుండానే రికార్డుస్థాయిలో రుణాలు సమీకరించింది. 58 ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు రూ.72,658 కోట్ల అప్పు చేయగా, ఏడాది పాలన పూర్తికాకుండానే రేవంత్ సర్కారు రూ.77,118 కోట్ల అప్పు తెచ్చింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72,658 కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించిందని కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో ప్రకటించింది. కానీ, నెలల్లోనే అంతకుమించిన అప్పు చేయడం గమనార్హం.
గతేడాది డిసెంబర్ 12న రూ.500 కోట్లతో అప్పుల పాలన మొదలు పెట్టిన రేవంత్ సర్కార్ తాజాగా మంగళవారం (నవంబర్ 12న) మరో రూ.1,000 కోట్లు అప్పు తెచ్చింది. ఒక్క ఆర్బీఐ నుంచే ఆగస్టు 13 వరకు రూ.42,118 కోట్ల అప్పులు చేసిన తెలంగాణ సర్కారు.. సెప్టెంబర్ లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్లు, అక్టోబర్లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్లు సమీకరించుకున్నది. మంగళవారం రూ.1,000 రుణంతో మొత్తం ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణం అక్షరాల రూ.52,118 కోట్లకు చేరింది. ప్రతి నెలా రూ.4,500 నుంచి రూ.ఐదు వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకుంటున్నది. ఈ విషయం ఆర్బీఐ ప్రతివారం వెల్లడించే గణాంకాల ద్వారా స్పష్టమైంది. నేరుగా ఆర్బీఐ నుంచి సేకరించే రుణాలు చాలక వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర నెలల్లోనే రూ.25 వేల కోట్ల మేర గ్యారెంటీలు ఇచ్చింది.
ఈ ఏడాది రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు రేవంత్రెడ్డి ప్రభు త్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించింది. బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్లో తెలిపింది.
ఒక్కో తెలంగాణ బిడ్డ తలపై రూ.19,279 అప్పు
ఒక్కరోజుకు రేవంత్ సర్కారు చేస్తున్న అప్పు రూ.226 కోట్లు
సుమారుగా ఒక్క వారానికి రూ.1,562 రుణం
సుమారుగా నెలకు రూ.6,780 కోట్లు