హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. అధికార కేంద్రీకరణను నిరోధించేది కూడా రాజ్యాంగమేనని తెలిపారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్ర క్రియ ద్వారానే తెలంగాణ ఏర్పాటైందని గుర్తుచేశారు. పేద, అణగారిన వర్గాల సంక్షేమ కోసం పనిచేస్తూ వెనుకబాటుతనం లేకుండా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తితో మనం నిబద్ధతతో పనిచేసి రాజ్యాంగ పితామహుల త్యాగాలను ఆచరణలో చూపాలని ఉద్బోధించారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల గురించి ప్రజలకు తెలియజేయాలని, ముఖ్యంగా యువతకు రాజ్యాంగం చేసిన దిశానిర్దేశం గురించి తెలియజేయాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వంగా దేశాన్ని నిలిపింది కూడా రాజ్యాంగమేనని చెప్పారు. విభిన్న నాగరికతల ఆకాంక్షలు, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఇబ్బందులు, మానవహక్కుల రక్షణకు భవిష్యత్తులో హామీని రాజ్యాంగం నిలువుటద్దంగా నిలిచిందని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కేవలం సంస్థలు, కోర్టు గదులకే పరిమితం కాదని, ఇంటింటికీ, ప్రతి గడపకూ, ప్రతి వ్యక్తికీ రాజ్యాంగాన్ని చేర్చాలని అభిలషించారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ జగన్, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.