హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సాగు భూముల విస్తీర్ణం.. పంట ఉత్పత్తుల పెంపులో, వ్యవసాయ అనుబంధరంగాల విస్తరణలో.. పారిశ్రామిక ప్రగతిలో.. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర అనిర్వచనీయం! శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 ఏండ్ల చరిత్రను స్వరాష్ట్రంలో తిరగరాసింది. దశాబ్దాలుగా ఒక్క పంటకూ సరిగ్గా నీళ్లివ్వని ఎస్సారెస్పీ ఇప్పుడు రెండు పంటలకు భరోసానిచ్చేలా చేసి ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని నెరవేర్చింది. చెరువులను నింపి ఊరుమ్మడి బతుకుల కడుపు నింపుతున్నది. అనుబంధ రంగాల విస్తరణకు పాదులు కొల్పుతున్నది. గుక్కెడు నీళ్ల కోసం మంజీరా, గోదావరి, కృష్ణా నదుల వెంట పరుగులు పెట్టిన హైదరాబాద్ నగరవాసుల తండ్లాటకు చరమగీతం పాడింది. భాగ్యనగరికి జలసిరిని చేకూర్చడమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు ధీమానిచ్చింది.
తాగునీటికి శాశ్వత భరోసానిచ్చిన కాళేశ్వరం
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లోనే రాష్ట్ర జనాభాలో 33 శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారు. భవిష్యత్తులో ఈ జనాభా మరింత పెరగనున్నది. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 60 శాతం మేర వనరులకు ఇదే కేంద్ర బిందువు. అంతటి ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ మహానగరం నీటి కోసం పరుగులు తీయకుండా ఉండాలంటే పుష్కలమైన నీటి వసతి అత్యవసరం! దానికి శాశ్వత భరోసా కల్పించింది కేసీఆర్ తీర్చిదిద్దిన కాళేశ్వరం! భాగ్యనగరికి జలసిరిని అందించబోతున్నదీ ఇదే ప్రాజెక్టు! కాళేశ్వరం ద్వారా ఏకంగా హైదరాబాద్ చెంతనే నగర జనాభా నీటి అవసరాల కోసం 65 టీఎంసీల స్టోరేజీ అందుబాటులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నగరానికి చెంతనే కొలువైంది. మల్లన్నసాగర్లో మరో 50 టీఎంసీలు, మొత్తంగా ఒక్క గోదావరి నుంచే 65 టీఎంసీల నీటి లభ్యత నిత్యం నగరానికి అందుబాటులోకి వచ్చింది.
అదీగాక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి, సింగూరు ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత తీరిపోనున్నది. ఎగువ నుంచి నీళ్లు రాకున్నా దిగువ నుంచి ఎత్తిపోతల ద్వారా ఆయా ప్రాజెక్టులను నింపేలా కాళేశ్వరానికి కేసీఆర్ రూపకల్పన చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా ఎంత పెరిగినా ఆయా ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో తాగునీటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు కృష్ణా నది నుంచి 16.6 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి వినియోగించాల్సి ఉంది. అయితే నాగార్జునసాగర్‌లో 510 అడుగులకు ఎగువన నీరుంటేనే ఆ మొత్తం వినియోగించుకునే పరిస్థితి ఉండేది. అలా నాటి పంపింగ్ స్టేషన్లను ఉమ్మడి పాలకులు ఏర్పాటు చేశారు. ఆ సమస్యకు సైతం సుంకేశుల ప్రాజెక్టు ద్వారా పరిష్కారం లభించింది. సాగర్‌లో మరింత దిగువకు 462 అడుగుల వద్ద పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఫలితంగా సాగర్‌లో ఎంత మేరకు నీళ్లు ఉన్నా హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసుకోవచ్చు. మొత్తంగా 2072 నాటికి పెరగనున్న నగర జనాభా తాగునీటి అవసరాలకు అనుగుణంగా గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాట్లు చేసింది. దేశంలోని ఏ మెట్రో నగరాలను చూసినా హైదరాబాద్‌కు ఉన్నంత పుష్కలమైన నీటి వసతి మరో నగరానికి లేదు.
మెట్రో పట్టణాల దుస్థితి