గ్రామాలు : 12,766
ఆడిటింగ్ పూర్తి: 9,500
శాతం : 75 శాతం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ దేశంలోనే వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను పంచాయతీలు ఎలా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆన్లైన్ ఆడిట్‌ను ప్రారంభించింది. మొదటి సంవత్సరంలోనే తెలంగాణ లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 12,766 గ్రామాలు లక్ష్యం కాగా.. ఇప్పటికే 9,500 పంచాయతీల ఆడిటింగ్ పూర్తయింది. సుమారు 75 శాతం గ్రామాల జమాఖర్చులను లెక్కించారు. నెలాఖరులోగా వందశాతం ఆడిటింగ్ పూర్తిచేసేందుకు ప్రయత్ని స్తున్నట్టు రాష్ట్ర ఆడిటింగ్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. ఆడిట్ శాఖ సిబ్బంది కృషి, ఇతర శాఖల అధికారుల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అది పూర్తికాగానే జీహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీల ఆడిటింగ్ చేపడుతామని తెలిపారు.
ఏపీ 14 శాతం గ్రామాల ఆడిటింగ్ పూర్తిచేసి రెండోస్థానంలో ఉన్నది. 13,371 గ్రామాలకుగాను దాదాపు రెండు వేల పంచాయతీల ఆడిటింగ్ పూర్తయింది. హిమాచల్‌ప్రదేశ్ 11 శాతంతో మూడోస్థానం, రాజస్థాన్ 10 శాతంతో నాలుగోస్థానం, కర్ణాటక 9 శాతంతో ఐదోస్థానంలో ఉన్నాయి. దాదాపు 16 రాష్ర్టాలు ఇప్పటివరకు కనీసం ఒక్క పంచాయతీ ఆడిటింగ్ కూడా పూర్తి చేయలేదు. ఇందులో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పెద్ద రాష్ర్టాలు ఉన్నాయి.
రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో 100 శాతం గ్రామాల ఆడిటింగ్ పూర్తయింది. జిల్లాలో 130 పంచాయతీలు ఉన్నాయి.
గతేడాది నుంచి ఆన్లైన్ ఆడిట్ మొ దలుపెట్టిన కేంద్రం 2019-20 సంవత్సరానికి రాష్ర్టాలు 25 శాతం గ్రామాల ఆడిట్‌ను పూర్తిచేయాలని నిర్దేశించింది. తెలంగాణ 40%ం పూర్తిచేసింది. దీంతో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది. అన్ని రాష్ర్టాల పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మంత్రులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో తెలంగాణను ప్రత్యేకంగా ప్రశంసించింది. దీంతో పలురాష్ర్టాలు తెలంగాణకు వచ్చి అధ్యయనం చేసివెళ్లాయి. ఈ ఏడాది 100 శాతం గ్రామాలను ఆడిటింగ్ చేయాలని తెలంగాణ లక్ష్యంగా విధించుకున్నది.