హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 721 మందికి పోలీసు సేవా పతకాలను హోంశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి పేర్లను రాష్ట్ర సేవా పతకాలకు పంపారు. వీరిలో అత్యత్తుమ సేవలందించిన 13 మందికి (పోలీసు 9, అగ్నిమాపకశాఖ 4) ‘తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకం’ అందించనున్నారు. ఈ పతకం పొందిన 13 మందికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ప్రతినెలా వారి వేతనంలో రూ.500 ఇంక్రిమెంట్ కలువనున్నది.
‘తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం’ 13 మందికి ప్రకటించారు. వీరికి రూ.40 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఉత్తమ సేవా పతకం పొందిన 112 మందికి రూ.30 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఇక కఠిన సేవా పతకం 58 మందిని వరించింది. వీరికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారు. సేవా పతకం పొందిన 525 మందికి కూడా రూ.20 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. వీటితోపాటుగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 50 మందికి ప్రత్యేకంగా రివార్డులు అందించనున్నారు.