Telangana | హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది. ఇందుకోసం జిల్లాల్లో కొత్తగా 70 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) అవసరమైన ప్రతిపాదనలను సిద్ధంచేసింది. భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించింది. భూసేకరణ పూర్తయిన జిల్లాల్లో దశలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రభాగాన నిలుపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐ-పాస్వంటి పారిశ్రామిక అనుకూల విధానాన్ని ప్రవేశపెట్టారు.
పరిశ్రమల కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 1,43,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 2014-2023 మధ్య పరిశ్రమల కోసం టీఎస్ఐఐసీ ద్వారా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్రామిక వాడల (ఇండస్ట్రియల్ కారిడార్స్)ను అభివృద్ధి చేయడంతోపాటు 28,500 ఎకరాల భూములను పరిశ్రమలకు కేటాయించారు. కొత్తగా అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో 23 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 40 ఏండ్లలో 109 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయగా.. తెలంగాణ సర్కారు కేవలం తొమ్మిదేండ్లలోనే 56 పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయడం విశేషం.
గ్రామీణ పారిశ్రామికీకరణకు పెద్దపీట
సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మంత్రతో ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ పారిశ్రామీకరణపై దృష్టి కేంద్రీకరించింది. జిల్లాల్లో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమల ఏర్పాటునకు సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీఎస్ఐఐసీ వివిధ జిల్లాల్లో కొత్తగా 70 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో జిల్లాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల చుట్టే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు ఎంఎస్ఎంఈలు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా, చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో సింహభాగం మన రాష్ర్టానికే వస్తున్నాయి. దీనికితోడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యేలా తనదైన శైలిలో కృషిచేస్తున్నారు.
ప్రఖ్యాతిగాంచిన తయారీ పరిశ్రమలను జిల్లాల్లో ఏర్పాటుచేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఐటీసీ సంస్థ మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో కొలువుదీరింది. ఇక్కడ దాదాపు 20కిపైగా ఉత్పత్తులు తయారవుతున్నాయి. 18 చిన్న తరహా పరిశ్రమల (యాన్సిలర్ యూనిట్లు) ద్వారా ఐటీసీ తమ ఉత్పత్తులను తయారు చేయిస్తున్నది. సిరిసిల్లలోని అప్పెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ సంస్థ విదేశాలకు ఎగుమతిచేసే నాణ్యమైన దుస్తులను తయారుచేస్తుండగా, వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో ఏర్పాటవుతున్న కిటెక్స్, యంగ్వన్ సంస్థలు కూడా పూర్తిగా ఎగుమతులకు యోగ్యమైన దుస్తులను తయారు చేయనున్నాయి.
స్వరాష్ట్రంలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఆయా రంగాలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేశారు. ఇందులో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్స్పార్క్, రంగారెడ్డి జిల్లా రావిర్యాల (ఈ-సిటీ), మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందన్‌వల్లి ఇండస్ట్రియల్ పార్కు, నల్లగొండ జిల్లా దండుమల్కాపూర్‌లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టీఐఎఫ్) భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఎఫ్‌టీసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఇండస్ట్రియల్ పార్కు, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు తదితర పారిశ్రామికవాడలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇవికాకుండా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీ, జహీరాబాద్‌లో నిమ్జ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
పరిశ్రమల కోసం రాష్ట్ర సర్కారు చర్యలు
రాష్ట్రంలో పారిశ్రామికరంగం విస్తరణ వివరాలు..
త్వరలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ పార్కులు
జగిత్యాల : 1
ఖమ్మం : 1
మహబూబాబాద్ : 1
మహబూబ్‌నగర్ : 3
మెదక్ : 7
మేడ్చల్ మల్కాజిగిరి : 4
నాగర్‌కర్నూల్ : 1
నల్లగొండ : 3
నారాయణపేట : 1
నిర్మల్ : 1
రాజన్న సిరిసిల్ల : 4
రంగారెడ్డి : 19
సంగారెడ్డి : 6
సిద్దిపేట : 6
వికారాబాద్ : 5
వనపర్తి : 2
వరంగల్ : 1
యాదాద్రి భువనగిరి : 4
మొత్తం : 70