Kanti Velugu | సిద్దిపేట : గజ్వేల్( Gajwel ) పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు( Kanti Velugu ) శిబిరాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister Harish rao ) ఆకస్మికంగా సందర్శించారు. శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయని చెప్పడంతో మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. 32 లక్షల మంది పురుషులు కాగా, 38 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారని స్పష్టం చేశారు. మహిళల నుండి ఎక్కువ ఆదరణ వస్తున్నదన్నారు.
12 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్( Raeding Glasses ) పంపిణీ చేయగా, ఎనిమిది లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ అవసరం అని గుర్తించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కంటి వెలుగు ద్వారా 20 లక్షల మందికి కంటి సమస్యలు తొలగిపోయాయి. 4565 గ్రామ పంచాయతీల్లో, 1616 మునిస్పల్ వార్డుల్లో కంటి వెలుగు క్యాంపులు నిర్వహణ పూర్తి అయ్యింది. వంద రోజుల్లో అందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. బాగా కృషి చేస్తున్న వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అందరి కంటి సమస్యలకు పరిష్కారం చూపాలి. కంటి వెలుగు సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నం చేయాలని మంత్రి సూచించారు.