హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీర్ బ్రాండ్ల వినియోగ ధరల్లో సుమారు 70% ప్రభుత్వ పన్నులే ఉన్నాయని, తమకు నష్టాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు కింగ్ఫిషర్ వంటి తమ బ్రాండెడ్ బీర్లను వినియోగదారులకు అందిస్తూ వచ్చామని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీనికితోడు తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) నుంచి తమకు భారీగా బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించేంత వరకూ తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల సరఫరాను నిలిపిస్తున్నామని స్పష్టం చేసింది. బీరు తయారీ ముడిసరుకు ధరలు పెరిగాయని, బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమేనని, అందులో 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయని తెలిపింది. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదని, నష్టాలతో వ్యాపారం చేయలేకే తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేసింది.
రెండేండ్ల నుంచి రూ.702 కోట్ల బకాయిలను కార్పొరేషన్ విడుదల చేయకపోవడం, బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు యూబీఎల్ తెలిపింది. ఈ మేరకు యూబీఎల్ ప్రతినిధులు ఆబారీ శాఖ డైరెక్టర్ సీహెచ్ హరికిరణ్ను నాంపల్లిలోని ఆబారీ భవన్లో కలిసి లేఖను అందించారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావును కూడా కలిసినట్టు తెలిసింది.