Students | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మూడో తరగతిలోని విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను ఎంత మంది చదవగలరంటే కేవలం 6.8శాతం మాత్రమే. 2018లో చదివేవారి శాతం 12.6గా ఉంటే, 2022లో 6.3శాతానికి పడిపోగా, 2024కు వచ్చేసరికి 6.8శాతానికి పరిమితమయ్యింది. అన్ని రాష్ర్టాలతో పోల్చితే ఇదే అత్యల్పం. ఈ విషయంలో బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ర్టాల కన్నా తెలంగాణ వెనుకబడి ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్-2024లో వెలుగుచూసింది. ఇండియా రూరల్ పేరుతో అసర్ సంస్థ రిపోర్టును మంగళవారం విడుదల చేసింది. మూడో తరగతి విద్యార్థులు 7.8శాతం మంది అక్షరాలను చదవలేని స్థితిలో ఉన్నారు. 26.5శాతం విద్యార్థులు అక్షరాలు చదివినా పదాలను ఉచ్ఛరించలేరు.
41.3శాతం మంది పదాలను చదువగలరు.. కానీ ఒకటో తరగతి పుస్తకాలను చదవలేని స్థితిలో ఉన్నారు. మరో 18.3శాతం మంది ఒకటో తరగతి పుస్తకాలు చదివినా రెండో తరగతి పుస్తకాలను చదవలేని స్థితిలో ఉన్నారు. ఇక కూడికలు రాని.. తీసివేతలు చేయలేని స్థితిలో విద్యార్థులున్నట్టు ఈ నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 13 నెలలుగా విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా విద్యాకమిషన్ను నియమించి అధ్యయనం చేయిస్తున్నారు. కానీ ఈ ఏడాది కాలంలో విద్యావ్యవస్థలో మార్పులు రాకపోగా, మరింతగా దిగజారడం గమనార్హం. సీఎం రేవంత్రెడ్డియే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఏదో చేసేస్తారు.. ఎంతో కొంత మార్పు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇదంతా ఉత్తదేనని ఈ నివేదికతో తేటతెల్లమయ్యింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..