Urea | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతిపక్షాలు కొత్త నాటకానికి తెరలేపాయి. రైతులను ఆందోళనకు గురిచేస్తూ ‘యూరియా కొరత’ అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అవసరానికి మించి అదనంగా యూరియా నిల్వలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపట్టడంతో కొరత అనే మాటే లేదు. అయినా ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. దీనికి ‘అంధజ్యోతి’ వంతపాడుతున్నది. యూరియా కొరత అంటూ పూర్తి అవాస్తవాలతో కథనాలు ప్రచురిస్తున్నది. వాస్తవానికి ఆదివారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్, కంపెనీల గోదాముల్లో కలిపి మొత్తం 2,18,492 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో రైళ్లలో 18,038 టన్నుల యూరియా రానున్నది. ఇందులో మిర్యాలగూడకు 5,215, సనత్‌నగర్‌కు 2746, జడ్చర్లకు 2,695, వరంగల్‌కు 1,595, కామారెడ్డికి 1320, నిజామాబాద్‌కు 1,316, జగిత్యాల, తిమ్మాపూర్‌కు చెరో 1,300, ఖమ్మంకు 550 టన్నుల యూరియా రానున్నది. 15వ తేదీలోగా ఇవన్నీ రాష్ర్టానికి చేరుకోనున్నాయి.
ప్రభుత్వం ముందుచూపు
మార్చి 31 నాటికే రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉన్నదంటే ప్రభుత్వ ముందుచూపును అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ కోసం ఇప్పటివరకు 9.93 లక్షల టన్నుల యూరియాను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది. వాస్తవానికి నిరుడు వానకాలం సీజన్లో రాష్ట్రంలో యూరియా వినియోగం 9.4 లక్షల టన్నులు మాత్రమే. అయినా సాగు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచనా మేరకు నిల్వలు భారీగా పెంచారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7.78 లక్షల టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశారు. మరో 2.18 లక్షల టన్నుల యూరియా అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నది. యూరియాతోపాటు డీఏపీ, ఎన్పీకే, ఎంవోపీ, ఎస్ఎస్పీ వంటి ఎరువులు సైతం పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ఎరువులు కలిపి ఆదివారం నాటికి 7,57,743 టన్నులు అందుబాటులో ఉన్నాయి.
కొరతపై అంధజ్యోతి కట్టుకథ
రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా నిల్వలు ఉంటే ప్రతిపక్షాలు మాత్రం కొరత అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టాయి. దీనికి అంధజ్యోతి తోడైంది. పలు జిల్లాల పేర్లు ప్రస్తావిస్తూ అక్కడ యూరియా కొరత ఉన్నదని పేర్కొన్నది. అక్కడ ప్రజలు ఫర్టిలైజర్ షాపులు, పీఏఎసీఎస్లు, గోదాముల వద్ద బారులు తీరారంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆ కథనంలో పేర్కొన్న సిద్దిపేట జిల్లాలో 3,631 టన్నులు, మెదక్‌లో 3,833, సంగారెడ్డిలో 5,362, సూర్యాపేటలో 5,065 , నల్గొండలో 4,620, యాదాద్రి భువనగిరిలో 1,633, ఖమ్మంలో 9,803, భద్రాద్రి కొత్తగూడెంలో 9,285 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నది. వాస్తవం ఇలా ఉంటే.. అంధజ్యోతి దానిని దాచిపెట్టి దుష్ప్రచారం చేయడంపై వ్యవసాయశాఖ అధికారులు, రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఒక్కసారిగా ఎరువులు కోసం కేంద్రాలకు తరలివస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడింది. వారందరికీ సరిపడా యూరి యా, ఇతర ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు మండిపడుతున్నారు.
దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
యూరియా నిల్వలపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో యూరియాతోపాటు అన్ని రకాల ఎరువులు సరిపడినంత నిల్వ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ, జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నది. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల టన్నులు, మార్ ఫెడ్ వద్ద 81 వేల టన్నులు, కంపెనీ గోదాముల్లో 6 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో మరో 18 వేల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది. యూరియాతోపాటు ఇతర ఎరువులు కలిపి మొత్తం 7.57 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
– నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రాష్ట్రంలో అన్నిరకాల ఎరువుల నిల్వ (టన్నుల్లో)