హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఎన్నికల యంత్రాంగం 100 శాతం పూర్తి చేసింది. ఈ ఫారాల డిజిటలైజేషన్లో కూడా గణనీయమైన పురోగతి నమోదైంది. మంగళవారం సాయంత్రం 6 వరకు 2,31,01,644 ఫారాలను డిజిటలైజేషన్ (68.29శాతం) చేశారు.
సీఈవో కార్యాలయం విడుదల చేసిన జిల్లాలవారీ నివేదిక ప్రకారం.. డిజిటలైజేషన్లో యాదాద్రి జిల్లా 90.33 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సిద్దిపేట (85.59%), నల్లగొండ (84.51%), ఆసిఫాబాద్ (84.09%), మెదక్ (84.03%), జనగామ (84. 34%), మహబూబాబాద్ (83.26%), కామారెడ్డి (82.83%), ములుగు (82.53%), నిజామాబాద్ (81.53%), సూర్యాపేట (81.48%), ఆదిలాబాద్(81.51%), జగిత్యాల (80%), పెద్దపల్లి(80.32%), గద్వాల(80.26%)డిజిటలైజేషన్‌ను పూర్తి చేశాయి.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల్లో వీవీఐపీ, వీఐపీల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల (డీఈవోలు)తో మంగళవారం సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను ఆన్లైన్లో సమర్పిస్తే హార్డ్‌కాపీ కోసం బీఎల్వోలు ఓటర్లను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.