Missing Persons | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతి రోజు ఎంతో మంది అదృశ్యమవుతున్నారు. పోలీసులు కొంతమంది ఆచూకీ కనుగొన్నప్పటికీ మరికొంత మంది ఆచూకీ లభించటం లేదు. నాలుగేండ్లలో రాష్ట్రంలో 6,468 మంది కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ కేసుల వివరాలపై యాత్ ఫర్ యాంటీ కరెప్షన్ సంస్థ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు తెలంగాణ డీజీపీ కార్యాలయం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. తెలంగాణలో గత నాలుగేండ్లలో 1,03,496 మంది కనిపించకుండాపోగా, రాష్ట్రవ్యాప్తంగా 96,614 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఆచూకీ దొరకకుండా పోయినవారి సంఖ్య అధికంగా ఉన్నది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 95 మంది బాలికలు, 55 మంది బాలురు, 554 మంది మహిళలు, 920 పురుషుల ఆచూకీ నేటికీ లభించలేదు. కాగా, 2024 ఏడాదిలో అక్టోబర్ వరకు మొత్తం 20,403 మంది అదృశ్యమయ్యారు. ఇందులో 17,054 మందిని పోలీసులు పట్టుకోగా, మిగతా 3,349 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.