Heavy Rainfall | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): మెగులుకు చిల్లు పడినట్టు.. కుండెడు నీళ్లు ఒక్కసారి గుమ్మరించినట్టు.. ఇంతకుముందెన్నడూ కురవనట్టు.. ఏకధారగా కుంభవృష్టి.. ఇది మామూలు వాన కాదు.. చరిత్రలో నిలిచిపోయే వాన.. ఏడాదిలో కురవాల్సిన వాన.. ఒక్కరోజులోనే కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతంతో కొత్త రికార్డు నమోదైంది. దీని ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని తెలిపింది. ఇదే జిల్లా వాజేడులో 2013 జూలై 19న 51.75 సెం.మీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన, 200 కేంద్రాల్లో 10 సెం.మీకుపైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు, మధ్య తెలంగాణవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. గత 6 గంటల్లో 60 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. తదుపరి కొన్ని గంటల్లో 30-40 మి.మి వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెలలో గరిష్ఠ వర్షపాతం నమోదవ్వగా, వచ్చే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కానున్నదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
వర్ష ప్రభావిత జిల్లాల్లో ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ములుగు జిల్లాకు కృష్ణ ఆదిత్య, భూపాలపల్లికి గౌతమ్, నిర్మల్‌కు ముషారప్ అలీ, మంచిర్యాల్లకు భారతి హోలికేరి, పెద్దపల్లికి సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ల్కు హన్మంతరావును ప్రత్యేకాధికారులుగా నియమించింది.
60 శాతం అధిక వర్షపాతం నమోదు
రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ మినహా (-39మి.మీ).. ఈ సీజన్లో 60 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సాధారణ వర్షపాతం 321.1 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 513.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60 శాతం అధికం. ఈ సీజన్లో హనుమకొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.