Ganja | జూలూరుపాడు, సెప్టెంబర్ 9 : అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
రాజమండ్రికి చెందిన ఎళ్ల భాస్కర్ రావు,అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ కొండా తేజ్ కుమార్, నాగరాజు, పుణెకు చెందిన ఏలు, ఒరిస్సాకు చెందిన ఆజాద్ ఐదుగురు వ్యక్తులు కలిసి మద్యానికి బానిసై డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి రూ.35.74 లక్షల విలువైన 63 కేజీల ఎండు గంజాయిని బొలోరో వాహనంలో పుణెకు తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మండలంలోని మాచినేనిపేట తండా గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకొని వాహనాన్నిసీజ్ చేసి వాహనంలో ఉన్న తేజ్ కుమార్, భాస్కర్ రావులను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. ఐదుగురు కలిసి పుణెకు గంజాయిని తరలిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మిగిలిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఎస్సై రవి, సిబ్బంది పాల్గొన్నారు.