హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉన్న ఎయిమ్స్ దవాఖానను పేరుకే మంజూరు చేశాం తప్ప.. కనీస వసతులు కల్పించలేదని, ఆ దిశగా దృష్టి పెట్టలేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకొన్నది. లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో బీబీనగర్ ఎయిమ్స్‌కు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి 1,154 పోస్టులు మంజూరు చేసినట్టు వెల్లడించింది. అయితే, ఇందులో 62 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నట్టు ఒప్పుకొన్నది. అంటే ప్రతి ఐదు పోస్టుల్లో 3 ఖాళీగానే ఉన్నాయి.
ఓ వైపు భవనాలు నిర్మించకపోవటంతో కనీసం ఒక్క ఆపరేషన్ థియేటర్ కూడా లేని దుస్థితి. మరోవైపు సరిపడా స్టాఫ్ లేకపోవడంతో ఎంబీబీఎస్ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్న పరిస్థితి. టీచింగ్ స్టాఫ్‌లో 45 శాతం, నాన్ టీచింగ్ స్టాఫ్‌లో 65 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్రం వెంటనే బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించటంతోపాటు సిబ్బందిని భర్తీ చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.