హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాబోయే విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో దాదాపు ఆరు వేలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగేండ్లల్లో 6,576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఐటీల విస్తరణకు కేంద్రం మంత్రివర్గం ఇటీవలే పచ్చాజెండా ఊపింది. విస్తరణ కోసం రూ. 11,828 కోట్లు మంజూరుచేసింది. 130 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దశలవారీగా కొత్త సీట్లు అందుబాటులోకి రానుండగా, 2025-26 విద్యాసంవత్సరంలో 1,364 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. నిరుడు ఐఐటీల్లో 17,740 సీట్లుండగా, రాబోయే నాలుగేండ్లల్లో మొత్తం సీట్ల సంఖ్య 19వేలకు చేరనున్నది. జాతీయంగా ఐఐటీ బూమ్ తారాస్థాయికి చేరింది. సీట్లన్నీ దాదాపు భర్తీ అవుతున్నాయి. గత పదేండ్లల్లో దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 100% పెరిగింది. మొదట్లో విద్యార్థుల సంఖ్య 65వేలు ఉండగా, ఇప్పుడది 1.35లక్షలకు చేరింది.
ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా)లో మరో ఆరు విద్యాసంస్థలు చేరనున్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో జోసా ద్వారా 127 విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీచేయనున్నారు. నిరుడు జోసా కింద 121 విద్యాసంస్థలుండగా, ఈ సారి కొత్తగా ఆరు విద్యాసంస్థలు చేరాయి. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 46 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు (జీఎఫ్టీఐ), ఐఐటీఎస్టీ శిబ్పూర్లోని సీట్లను జోసా కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా, జూన్ 2న ఫలితాలు విడుదలవుతాయి. ఈ సారి కూడా ఆరు విడతల్లో సీట్లను భర్తీచేసే అవకాశముంది. సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలకానున్నది.
హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు లభించిన వస్తువులు, ప్రాంతాల సమాచారంతో కూడిన పుస్తకాన్ని మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ టీ-హబ్లో ఆవిష్కరించారు. నాబార్డ్ సహకారంతో రిజల్యూట్ 4ఐపీ సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందించిందని తెలిపారు.