హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ కింద యాజమాన్యం రూ.6 వేలు ఇవ్వనున్నది. అయితే కనీసం రూ.10వేలు అడ్వాన్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అడ్వాన్స్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని, రూ.6వేలతో ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కూడా రావని తెలిపాయి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాయి. సింగరేణి సంస్థలో కార్మికులకు ఇస్తున్నట్టే ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక నెల జీతం ఇచ్చేలా సీఎం ప్రకటన చేయాలని కోరాయి.
రిటైర్డ్ ఆర్మీని సెక్యూరిటీగా నియమించాలి ; అధికారులకు మంత్రి రాజనర్సింహ ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లోని సెక్యూరిటీ సిబ్బందిలో కొంత శాతం రిటైర్డ్ ఆర్మీని నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండి, 50 సంవత్సరాల కంటే తకువ వయసు ఉన్నవారినే నియమించుకునేలా టెండర్ కండీషన్ ఉండాలని తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల నిర్వహణలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వరర్ల పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పారు. వరర్ల వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ల అక్రమాలకు అవకాశముండొద్దని, ఖాతాలోనే జీతం జమయ్యేలా కండీషన్ ఉండాలని సూచించారు.