Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 60 శాతంపైగా యువత ఉండటం ఆందోళనకర విషయమని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ వెల్లడించింది. ఇందులో చాలావరకు మాదకద్రవ్యాల బారినపడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నది. ఈ మేరకు అసోసియేషన్ బృందం 18-35 మధ్య వ్యక్తుల మానసిక పరిస్థితిపై అధ్యయనం చేసినట్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మోతుకూరి రాంచందర్ తెలిపారు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులైన వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని వెల్లడించారు. డ్రగ్స్‌కు ముందు, తీసుకున్న తర్వాత వారి శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించినట్టు వివరించారు. బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు, సైకియాట్రిస్టుల అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. డ్రగ్స్ తీసుకొనేవారి కేంద్ర నాడీవ్యవస్థ సరిగా పనిచేయక వారేం చేస్తున్నారో కూడా తెలియని సైకో ప్రపంచంలోకి వెళ్తారని తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని వెంటనే గుర్తించి సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స అందిస్తే మామూలు మనుషులుగా మార్చే అవకాశం ఉన్నదని తెలంగాణ కౌన్సెలింగ్ అసోసియేషన్ పేర్కొన్నది.
లక్షణాలు:
కండ్లు ఎర్రగా మారటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, నిద్రలేకుండా ఉండటం, చేతులు, కాళ్లలో వణుకు, చెమటలు పట్టడం, పల్స్రేట్ పెరగటం, శరీరం పట్ల శ్రద్ధ లేకపోవటం, తరుచూ పనులు వాయిదా వేయటం తదితర లక్షణాలు డ్రగ్స్ అలవాటు పడినవారిలో కనిపిస్తాయని సైకియాట్రిస్టులు చెప్పా రు. తల్లిదండ్రులు వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. యాంటి క్రేవింగ్ ట్రీట్మెంట్ ఇప్పించడం అతి ముఖ్యమని తెలిపారు.
ప్రతి పాఠశాలలో సైకాలజిస్టుల సేవలు అవసరం
డ్రగ్స్ భూతం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నది. తెలంగాణలో ఈ ఏడాది 938 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోత్రోపిక్ సబ్‌స్టాన్సెన్ (ఎన్డీపీఎస్) చట్టం కింద 78,331 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ బాధితులకు కౌన్సెలింగ్ సేవలందించటం ముఖ్యం. ప్రతి పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమిస్తే విద్యార్థులు చెడుదారుల్లో నడవకుండా సన్మార్గంలో నడిచేలా ప్రేరణ కల్పిస్తారు. డ్రగ్స్ బారిన పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మేమూ సిద్ధం. 9533660938 నంబర్‌ను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ఇస్తాం.
– డాక్టర్ మోత్కూరి రామచంద్రం, ప్రెసిడెంట్, తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్