టీ20 ప్రపంచకప్‌లో చిన్నజట్ల స్ఫూర్తిధాయక ప్రదర్శనలు మినహా ఏకపక్ష మ్యాచ్‌లతో విసిగిపోతున్న అభిమానులకు బుధవారం అహ్మదాబాద్‌లో పసందైన విందు భోజనం లాంటి క్రికెట్ మజా దక్కింది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్’ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ రెండుసార్లు ‘టై’ అయిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాదే పైచేయి అయినా ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదంటూ ఆఫ్ఘాన్ చేసిన పోరాటం అభిమానులను కట్టిపడేసింది.
అహ్మదాబాద్ : పొట్టిపోరుకు అసలు సిసలు అర్ధాన్ని చెబుతూ అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో సౌతాఫ్రికా అద్భుత విజయంతో సూపర్-8 బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. మ్యాచ్‌లో ముందుగా దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లకు 187/6 చేసింది. రికెల్టన్ (28 బంతుల్లో 61, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (41 బంతుల్లో 59, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరిపోరాటానికి తోడు లోయరార్డర్ బ్యాటర్ల మెరుపులతో ఆఫ్ఘానిస్థాన్ 19.4 ఓవర్లలో 187కు ఆలౌటైంది. విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ అవసరమవగా అసలు డ్రామా అంతా ఇక్కడే మొదలైంది. తొలి సూపర్ ఓవర్లో రెండు జట్లూ 17 రన్స్ చేయడంతో రెండోదీ ఆడించాల్సి వచ్చింది. మొదటిదానికి ఎక్కడా తగ్గకుండా రెండో సూపర్ ఓవర్ అంతే ఉత్కంఠగా సాగి గుర్బాజ్ వీరోచితంగా పోరాడినా ఆఫ్ఘాన్ తలవంచక తప్పలేదు. మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన సఫారీ పేసర్ లుంగి ఎంగిడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వరుసగా రెండు ఓటములతో సూపర్ -8 ఆశలను ఆఫ్ఘాన్ మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఛేదనను కాబూలీ ఓపెనర్లు ధాటిగానే ఆరంభించి 4 ఓవర్లలోనూ 50 రన్స్ దంచారు. ముఖ్యంగా సఫారీ పేసర్లపై గుర్బాజ్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. కానీ ఎంగిడి ఐదో ఓవర్లో జద్రాన్ (12), నయీబ్‌ను ఔట్ చేయగా మరుసటి ఓవర్లో రబాడా సెదికుల్లాను డకౌట్ చేశాడు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాక గుర్బాజ్ కాస్త నెమ్మదించినా మార్క్మ్ ఓవర్లో 4, 6తో టచ్‌లోకి వచ్చాడు. కానీ కేశవ్ 13వ ఓవర్లో గుర్బాజ్‌తో పాటు రసూలీని ఔట్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో అజ్మతుల్లా (22), కెప్టెన్ రషీద్ ఖాన్ (20) మెరుపులతో ఆ జట్టు విజయానికి చేరువైంది. కానీ 6 బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఆఖరి ఓవర్లో ఆఫ్ఘాన్ విజయానికి 12 రన్స్ అవసరమవగా రెండో బంతికి నూర్ అహ్మద్ (15*) సిక్స్ కొట్టాడు. చివరి 3 బంతుల్లో 2 రన్స్ చేస్తే విజయమనుకున్న దశలో నాలుగో బంతిని రబాడా నోబాల్‌గా వేశాడు. ఆ మరుసటి బంతిని అహ్మద్ లాంగాఫ్ మీదుగా ఆడి ఒకటో పరుగు తీయడంతో స్కోర్లు సమమైనా గెలుపు పరుగును పూర్తిచేసే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఫరూఖీ రనౌట్ అయ్యాడు. అంతే.. మ్యాచ్ డ్రా అయింది. డ్రామా మొదలైంది.
మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. వికెట్లేమీ నష్టపోకుండా 17 రన్స్ చేసింది. బదులుగా సఫారీలు మిల్లర్, బ్రెవిస్‌లను బరిలోకి దించగా రెండో బంతికి సిక్స్ కొట్టిన బ్రెవిస్ మూడో బాల్‌కు ఔట్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన స్టబ్స్ 4, 6 బాదడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ సఫారీలది. స్టబ్స్ ఒకటి, మిల్లర్ రెండు సిక్స్‌లు కొట్టడంతో ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట 23 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. తాడోపేడే తేల్చుకునేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్.. రెండో బంతికే నబీ వికెట్ కోల్పోయినా గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి పోరును మరింత రసవత్తరంగా మార్చేశాడు. ఐదో బంతిని కేశవ్ వైడ్ విసరడంతో ఆఖరి బంతికి ఆ జట్టు విజయానికి 5 రన్స్ కావాల్సి వచ్చింది. కానీ గుర్బాజ్ ఇచ్చిన క్యాచ్‌ను పాయింట్ వద్ద మిల్లర్ అందుకోవడంతో కాబూలీల ఆశలు అడియాసలయ్యాయి. మరోపక్క ఓడతామనుకున్ను మ్యాచ్‌ను గెలిచిన సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లకు 187/6 (రికెల్టన్ 61, డికాక్ 59, అజ్మతుల్లా 3/41, రషీద్ 2/28);
ఆఫ్ఘాన్: 19.4 ఓవర్లకు 187 ఆలౌట్ (గుర్బాజ్ 84, అజ్మతుల్లా 22, ఎంగిడి 3/26, కేశవ్ 1/27)
