పెద్దపల్లి/ముత్తారం, అక్టోబర్ 27: పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని పెద్దపల్లి దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాఠశాల పరిధిలో గడ్డి మందు కొట్టించగా.. అదే గడ్డిని ఆదివారం విద్యార్థినులతో తొలగించారు. ఆ ప్రభావం వల్ల జరిగిందా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోయిన్పల్లి శంకర్రావు ఆదివారం వంద పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకొన్నారు. వందేళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, తన పనులు తానే చేసుకుంటూ, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు. కంటి అద్దాలు లేకుండానే నిత్యం దినపత్రికలు చదువుతారు.