న్యూఢిల్లీ: మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య హింస మళ్లీ చెలరేగింది. బాంబు దాడులు, రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తూ మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. ఆదివారం ఉదయం జిరిబామ్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మిలిటెంట్లు రాకెట్ లాంచర్ దాడిలో శనివారం మోయిరాంగ్ వద్ద ఒక వృద్ధుడు మరణించాడు. హింస నేపథ్యంలో సరిహద్దు జిల్లాలో భద్రతా వర్గాలు యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటుచేశాయి. వివిధ జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గ్రామ రక్ష క వాలంటీర్లు’గా తమకు తాము ప్రకటించుకున్న మైతీ, కుకీ వర్గాలకు చెందిన గ్రూపులు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు దిగుతున్నాయని, రాజధాని ఇంఫాల్‌కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్చప్పీ గ్రామంపై ఆదివారం కుకీ మిలిటెంట్లు బాంబు దాడులు, కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకుని వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. మిలిటెంట్స్ ఏర్పా టు చేసుకున్న బంకర్లను ధ్వంసం చేశామని పోలీస్ అధికారి కబీబ్ చెప్పారు.