Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రుణమాఫీ హామీని కూడా నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. గాంధీభవన్‌లో బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్పారు. రైతు రుణమాఫీపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. రైతు భరోసా సాయం ఎగ్గొట్టడానికి ఏవేవో నిబంధనలను పెట్టబోతున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని భట్టి స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు రైతు భరోసా తప్పకుండా అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. లోతుగా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయం సేకరించి అసెంబ్లీలో చర్చించి విధి విధానాలను రూపొందిస్తామని అన్నారు. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలకు కూడా ఇవ్వాలని ప్రజలు చెబితే అలాగే ఇస్తామని చెప్పారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే ప్రతి పైసా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
చంద్రబాబు, రేవంత్ సహచరులే..
ఆంధ్రాలో ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని భట్టి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహచరులే తప్ప గురుశిష్యులు కాదని భట్టి గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుపడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని ఆయన ఆరోపించారు. 7 మండలాలను ఆంధ్రలో విలీనం చేసినప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉందన్న విషయాన్ని మరిచిపోయారా? అని భట్టి ప్రశ్నించారు. తెలంగాణ మండలాలను ఆంధ్రలో కలపడాన్ని బీఆర్ఎస్ అడ్డుకోలేదని విమర్శించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు చెబుతున్న కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదని, అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆంధ్రకు అప్పజెప్పిందని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏడు మండలాల గురించి ఎందుకు మాట్లాడలేదని భట్టి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని వదలిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. దోషులు ఏ స్థాయిలో ఉన్నా విచారణ జరిపించి కఠినంగా శిక్షపడే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు.
గ్యారెంటీ 1- మహాలక్ష్మి
గ్యారెంటీ 2- రైతు భరోసా
గ్యారెంటీ 3- గృహజ్యోతి
గ్యారెంటీ 4- ఇందిరమ్మ ఇండ్లు
గ్యారెంటీ 5- యువ వికాసం
గ్యారెంటీ 6- చేయూత