ఆదిలాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఆరుగురు కూ లీలు మరణించారు. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో ఇద్దరు మృతిచెందారు. బేల మండలం సాగిండిల గేడం నందిని (30), సోన్కాస్లో కోవ సునీత(38) పిడుగుపాటుకు అక్కడికక్కడే మరణించారు.
గాదిగూడ మండలం పిప్పిరిలో పత్తి చేనులో 11 మంది కూలీలు విత్తనాలు వేస్తున్న క్రమంలో ఉరుములతో కూ డిన భారీ వర్షం ప్రారంభంకావడంతో వారు అక్కడే ఉన్న పశువుల పాకలోకి వెళ్లారు. ఇంతలోనే పిడుగు పాకపై పడటంతో సిడాం రాంబాయి(35), పెందూర్ మాధవరావు(42), పెందూర్ సంజన(19), భీంబాయి(35) మరణించారు. ఏడుగురు గాయపడగా వారిని చికిత్స కోసం ఆదిలాబా ద్ రిమ్స్‌కు తరలించారు. కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు పిడుగుపాటుతో మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.