హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదంటూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా అబద్ధమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలిలో తేల్చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం కొత్త రేషన్‌కార్డులపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు. 2016 నుంచి 2023 వరకు కొత్తగా 6,47,479 రేషన్‌కార్డులను గత ప్రభుత్వం జారీ చేసిందని వెల్లడించారు. తద్వారా 20.69 లక్షల మంది లబ్ధిపొందినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల తెల్ల రేషన్‌కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.
కొత్త కార్డులు ఇప్పట్లో లేనట్టే!
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదంటూ ఇంతకాలం అబద్ధాలను ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కొత్త కార్డుల జారీపై మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారంలోకి రాగానే కొత్త కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో పేదలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను అడియాశలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా సంక్రాంతి తర్వాత ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అయితే, ఇప్పటివరకు కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి దరఖాస్తులే స్వీకరించలేదని తెలిపారు. రేషన్‌కార్డులపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఎప్పటిలోగా ఇస్తుందో కూడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు, దరఖాస్తులు స్వీకరించేదెప్పుడు, కొత్త కార్డులు జారీ చేసేదెప్పుడు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.