హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ధాన్యం గ్లోబల్ టెండర్లకు విశేష స్పందన వచ్చింది. గురువారం సాయంత్రం బిడ్లు తెరువగా 54 టెండర్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని పౌరసరఫరాల సంస్థ భావించింది.
దీనిని 25 లాట్లుగా విభజించి, ప్రతి లక్ష మెట్రిక్ టన్నులకు ఒక లాట్ చొప్పున ఆన్ లైన్లో బిడ్లు ఆహ్వానించింది. ఇందుకు గత నెలలో టెండర్లు పిలిచింది. గురువారం సాయంత్రం అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో 8 లాట్లకు ఒకో బిడ్ మాత్రమే దాఖలైనట్టు సమాచారం. ఫైనాన్షియల్ బిడ్లను శనివారం తెరువనున్నారు. అనంతరం అర్హులను ఎంపిక చేస్తారు.