హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని నిర్వహించనున్నది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈసారి మాదాపూర్‌లోని శిల్పకళావేదికకు మార్చారు. గతంలో రవీంద్రభారతిలో నిర్వహించేవారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పలువురు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం హాజరుకానున్నారు. అయితే ఈ సారి పాఠశాల విద్యాశాఖ నుంచి 52మంది ఉత్తమ టీచర్లను ఎంపికచేశారు. వీరిలో కేజీబీవీలు, మాడల్ స్కూల్స్, ఎయిడెడ్ నుంచి ముగ్గురు చొప్పన 9మంది ఉండగా, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల నుంచి 43 మంది బెస్ట్ టీచర్లను ఎంపికచేశారు. ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నుంచి మరో 50మందికిపైగా లెక్చరర్లను విద్యాశాఖ ఎంపికచేసింది.