హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.10,500 కోట్ల విలువ చేసే 51 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 6972 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 3097 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం 90వేల మంది రైతుల నుంచి సేకరించామని వివరించారు. సేకరించిన వాటిలో 50.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, వీటికోసం 13 లక్షల గన్నీలను ఉఫయోగించామని పేర్కొన్నారు.
ఇంకా అవసరాలకు మించి 8లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ రైతులకు రూ. 8,576 కోట్లను చెల్లించామన్నారు. గత ఏడాది కన్నా ధాన్యానికిఅధికంగా డిమాండ్ ఉండడంతో ప్రైవేట్ వ్యాపారులు సైతం కనీస మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజు కన్నా అధికంగా ధాన్యం సేకరించామని వెల్లడించారు.