హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామని చెప్పారు. నెట్ జీరో సిటీ తరహాలోనే ఫ్యూచర్ సిటీ డిజైన్స్ ఉండాలని సీఎం ఆదేశించారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని సూచించారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలుపెట్టేలా నిబంధన విధించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలని, గ్రూప్-1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని, 1,500 ఎకరాల్లో డాటా సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.