Medaram | తాడ్వాయి : వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లులకు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగ చూడు తల్లీ అంటూ వేడుకుని యాటపోతులను సమర్పించి జాతర పరిసరాల్లో విడిది చేశారు.
భక్తులు విడిది చేయడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. భక్తులు పోటెత్తడంతో అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు. కాగా బుధవారం ఒక్కరోజే జాతరకు 50 వేల మంది భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.