HMDA | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు కావాలా? అయితే ఫలానా ముగ్గురు సార్లను కలిసి రండి.. వాళ్లే చూసుకుంటారు.. అప్పటివరకు ఫైల్ ఇక్కడే ఉంటది.. వాళ్ల నుంచి క్లియరెన్స్ వస్తేనే ఫైళ్లు ముందుకు..’ ఇదీ హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ ఆధారిటీ ‘హెచ్ఎండీఏ) సిబ్బంది రియల్టర్లకు చెప్తున్న మాట. ‘త్రూ ప్రాపర్ చానల్’ ద్వారా కాకుండా నేరుగా లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా వెళ్తే వారికి చుక్కెదురు అవుతున్నది. ‘త్రూ ప్రాపర్ చానల్’ ద్వారా రావాలంటూ అక్కడి ఉన్నతాధికారులే ఓ ప్రముఖ బిల్డర్ (ముఖ్యనేతకు దగ్గరి బంధువు), ప్రభుత్వ పెద్దకు షాడో, మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నంబర్, అడ్రస్ ఇచ్చి పంపుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో 17 ఎకరాల లే అవుట్ చేసిన బిల్డర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. లే అవుట్‌కు సంబంధించి కిందిస్థాయి నుంచి కమిషనర్ ద్వారా అనుమతి దక్కింది. కానీ, రోజులు గడుస్తున్నా.. డీసీ లెటర్ మాత్రం రిలీజ్ కాలేదు. ఆదేమంటే ‘త్రూ ప్రాపర్ చానెల్’ అంటూ ఆ ముగ్గురు పేర్లు సదరు బిల్డర్లకు వినబడ్డాయి. ఇదొక్కటే కాదు, ఐదు ఎకరాల పైబడిన లే అవుట్, లే అవుట్ కం హౌజింగ్, ఐదు లక్షల ఎస్ఎఫ్టీతో కూడిన బిల్డింగ్‌లన్నీ హెచ్ఎండీఏలో కాకుండా ‘త్రూ ప్రాపర్ చానెల్’ ద్వారానే అనుమతులు దక్కుతున్నట్టు రియల్ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
డబ్బులివ్వకుంటే కొర్రీలు
ఓపెన్ లే అవుట్, లే అవుట్ విత్ హౌజింగ్, మల్టీస్టోరేజ్ బిల్డింగ్.. నిర్మాణం ఏదైనా… సకాలంలో అనుమతి దక్కాలంటే ఆ ముగ్గురితో బేరం కుదుర్చుకుని ప్రాజెక్టులో చదరపు మీటర్‌కు రూ.50 చొప్పున సమర్పించుకోవాలి. లేదంటే కొర్రీలతో నెలల తరబడి నిరీక్షణ తప్పదు. కొందరు అధికారులు ఈ ముగ్గురికి సహరిస్తూ వారి ప్రమేయంతోనే నచ్చిన ఫైళను ‘ఒకే’ చేస్తున్నారని, ‘త్రూ ప్రాపర్ చానల్’ను కలవకపోతే ఆ ఫైళ్లకు ‘డిస్కస్’, ‘స్పీక్’ అంటూ అధికారులు కొర్రీ పెడుతున్నారని బిల్డర్లు వాపోతున్నారు. అసలే రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్న తరుణంలో ఇప్పటికే ఉన్న వారిని ప్రోత్సహించాల్సింది పోయి వసూళ్ల దందా మొదలు పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీజీ బీపాస్ వచ్చిన నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయకుండా నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టుకుంటున్నారని, ఏపీవో నుంచి కమిషనర్ స్థాయి వరకు ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్తున్నారు. వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో బిల్డర్లకు ఎదురుచూపులు తప్పడం లేదని పేర్కొంటున్నారు.
మాజీ మంత్రులూ బాధితులే
నిర్మాణరంగ అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాల్సిన అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నిర్మాణ అనుమతుల విషయంలో ఎక్కువ కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. బాచుపల్లిలో ఒక మాజీ మంత్రికి చెందిన దవాఖానా విషయంలో అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి లేని కొర్రీ పెట్టినట్టు తెలిసింది. దీంతోపాటు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రికి సంబంధించిన అనుమతుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు సమాచారం.
నాన్ క్యాడర్ అధికారులదే హవా!
హెచ్ఎండీఏలో కొందరు అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. వాళ్లు చేయాలనుకున్నదే ఫైల్, లేదంటే వెనక్కి తిప్పి పంపుతూ అనుమతుల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా కమిషనర్, జాయింట్ కమిషనర్ తర్వాత కీలక అధికారిగా ఉన్న నాన్ క్యాడర్ ఉన్నతాధికారులు కొన్నేండ్లుగా అక్కడే తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తనకు సంబంధం లేని విభాగాల కార్యాచరణలోనూ కాలు పెడుతూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఉద్యోగులు చెప్తున్నారు. లే అవుట్, భవన నిర్మాణ అనుమతుల విషయంలో, సంస్థ చేపట్టే భారీ ఇంజినీరింగ్ ప్రాజెక్టుల టెండర్ల రూపకల్పనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక టెండర్ విషయంలో తమ వాళ్లకే కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించి, దానిని అఫ్రూవ్ చేసేలా పై అధికారులపై ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతున్నది. దీనిని హెచ్ఎండీఏలో సీనియర్ ఐఏఎస్ అధికారి పసిగట్టి ఆ ఫైల్‌ను పక్కన పెట్టారని, ఆ కోపంతో సదరు అధికారిపై లేని పోని అరోపణలు వచ్చేలా తోటి అధికారులను ఊసిగొలుపుతారన్న చర్చ జరుగుతున్నది. బిల్డింగ్, లే అవుట్ అనుమతుల విషయంలోనూ అనేక అక్రమాలకు తెరలేపాడని, ఏండ్ల తరబడి పాతుకుపోయిన సదరు న్యాన్ క్యాడర్ అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.