హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు గాడినపడటంలేదు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను అమలుచేస్తూ గైర్హాజరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. విద్యార్థుల హాజరు సగటున 50% లోపే ఉంటున్నది. ఈ వారంలోని వివరాలను పరిశీలిస్తే.. సర్కారు జూనియర్ కాలేజీల్లో మొత్తం 1,61,166 మందికి 1,46,377 మంది ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
విద్యార్థుల హాజరు 72,092 (49.25%)గా ఉంది. ఒకట్రెండు జిల్లాల్లో 29% లోపే ఉంది. ఆయా జిల్లాల్లో 72% విద్యార్థులు కాలేజీలకు గైర్హాజరవుతున్నారు. హైదరాబాద్‌లోనూ విద్యార్థుల గైర్హాజరు 56శాతంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది. పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలో విద్యార్థుల గైర్హాజరు ఆందోళన కలిగిస్తున్నది. ఇంటర్లో ఉత్తీర్ణతాశాతం 65శాతమే ఉంటున్నది. అంటే 35% మంది విద్యార్థులు ఫెయిలవుతున్నారు. విద్యార్థుల గైర్హాజరు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడటం లేదన్న వాదనలున్నాయి. తల్లిదండ్రులే విద్యార్థులను పనులకు పురమాయిస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. విద్యార్థులు సైతం పుస్తకాలకు నో చెప్పి.. పనులకు సై అంటున్నారు.
