హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించి పేద కుటుంబానికి అండగా నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఆ మొత్తాన్ని అందజేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్, అలేఖ్య దంపతుల కొడుకు మాధవన్ కొన్నేండ్లుగా జన్యు సంబంధిత గౌచర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు.
మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆ బాలుడికి చికిత్సకోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో బాలుడి తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కు అందించారు. తమ కొడుకు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తమ ఇంటికి వచ్చారని ఆరోజు తమ కొడుక్కి వ్యాక్సిన్ వేయించేందుకు హాస్పిటల్ వెళ్లామని బాలుడి తండ్రి మహేశ్వర్ తెలిపారు. తమను హైదరాబాద్ పిలిపించుకొని ఆర్థికసాయం అందజేసిన పోచంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారు.