Telangana | కొడిమ్యాల, ఏప్రిల్ 3: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శాఖ బీజేపీ అధ్యక్షుడు బక్కశెట్టి శ్రీనివాస్, నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల కాంతమ్మకు రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా వారి ఇంటికెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేస్తునట్టు చెప్పారు. అనంతరం పూడూరు గ్రామ బీజేపీ అధ్యక్షుడు బక్కశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ లక్ష్మి ఇటీవలే మరణించింది. ఆమె పేరుమీద భూమి ఉండడంతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ఈ రోజు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి రూ.5 లక్షల బీమా మంజూరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులను ఆదుకునేందుకు ఇలాంటి పథకాలు లేవు. తెలంగాణలో మాత్రం రైతులు, రైతు కుటుంబాల కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. పార్టీలకతీతంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నా. బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించడంతోపాటు గుంట భూమితో పాస్బుక్ ఉండి ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.5 లక్షలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నాకు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక సాయం చాలా గొప్పది’ అని పేర్కొన్నారు.