యూసఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావుకు మొన్న అర్ధరాత్రి 2 గంటలకు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు సోమాజిగూడలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ ఈసీజీ తీసి అడ్మిషన్ కోసం వివరాలు అడిగారు. కుటుంబసభ్యులు పోలీసు ఆరోగ్య భద్రతా కార్డు చూపడంతో వెంటనే ఇక్కడ బెడ్లు ఖాళీలేవు. ఎక్కడికైనా తీసుకెళ్లండని తెగేసి చెప్పారు. అప్పటికే మ్యాసివ్ స్ట్రోక్ రావడం, చేతిలో డబ్బుల్లేక, మరో చిన్నపాటి ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే సమయం మించిపోయి జనార్దన్ చనిపోయారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఆనందరావు (పేరు మార్చాం)కు 15 ఏండ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. నేటికీ కానిస్టేబుల్‌గానే విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 డీఏలు, మూడు సరెండర్లు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ ఎరియర్స్ అతీగతీ లేదు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని, కొంత అప్పుచేసి ఇల్లు పని మొదలుపెట్టాడు. ఇన్నాళ్లూ సలాం చేసిన చుట్టుపక్కల వాళ్లు ఆయన అప్పులభారం చూసి మర్యాద ఇవ్వడమే మానేశారు. పిల్లల చదువులు, వారి ఫీజులు, ఇంటి ఖర్చులకు తోడు సొంత డబ్బుతో బందోబస్తుకు వెళ్తుండటంతో బతుకే భారమైంది.
Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలోని ఏ ఒక్క జనార్దన్‌రావు, ఆనందరావు దుస్థితో కాదు.. తెలంగాణలోని 50 వేల మంది కానిస్టేబుళ్ల మానసిక వ్యథ. బయట చేయిచాచి అడుక్కోలేని పోలీసు అధికారులందరి దీనస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డారు. పెండింగ్ డీఏలు, టీఏలు, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్లు, జీపీఎఫ్, మెడికల్ బిల్లుల చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. దీంతో దీంతో అష్టకష్టాలు పడుతున్నారు. కానిస్టేబుల్ నుంచి పైస్థాయి అధికారి వరకూ రావాల్సిన 5 డీఏలు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం కొన్నిచోట్ల ఒకట్రెండు సరెండర్లు విడుదల చేసినా.. ఉపయోగం లేకుండాపోయింది. ఓ జిల్లాలో 3,000 మంది సిబ్బంది ఉంటే.. కేవలం 30 నుంచి 40 మందికి మాత్రమే సరెండర్లు పడ్డాయి. మిగతవారు తమకెప్పుడు సరెండర్ నిధులు విడుదలవుతాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆ ఒక్క సరెండర్ ఊసే లేదు. గత పీఆర్సీ ఆమోదించిన అడిషనల్ హెచ్ఎస్ఏ, రేషన్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్, రిస్ అలవెన్స్, డ్రైవర్ అలవెన్స్, ట్రైనింగ్ సెంటర్స్ అలవెన్సు ఇలా చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాపోతున్నారు. కానిస్టేబుల్ నుంచి పైస్థాయి అధికారి వరకూ సగటున ఒక్కొక్కరికీ సుమారు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం తమకు బాకీ ఉన్నదని ఆ ఉద్యోగ వర్గాల సమాచారం.
కష్టాల కడలిలో తప్పని ఎదురీత
పేరుకు పోలీసు ఉద్యోగమైనా ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి కష్టాలే చెప్పుకుంటున్నారు. ఒక్కో పోలీస్ అధికారికి సగటున ఒక సరెండర్ కింద సుమారు రూ.30 వేల నుంచి 50 వేలు రావాల్సి ఉంటుంది. సీనియార్టీ ఉంటే సుమారు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు రావాల్సి ఉంటుంది. అవి ఎప్పుడో వస్తాయో తెలియదు. 2003 కంటే ముందు పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీపీఎఫ్ కింద పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇంటి ఖర్చు, ఆరోగ్య అవసరాలకు కోసం బిల్లులు పెట్టుకున్నా పట్టించుకునే దిక్కేలేదు. ఆరోగ్య భద్రత నుంచి దవాఖానలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులకు చికిత్స చేయడానికి దవాఖానలు నిరాకరిస్తున్నాయి. సొంత డబ్బుతో బందోబస్తుకు వెళ్తే.. టీఏలు ఇవ్వని దుస్థితి. వీటికి తోడు పెరిగిన ధరలతో సగటు కానిస్టేబుల్ కుటుంబం నెల గడిపేందుకు తీవ్రంగా సతమతమవుతున్నది. ఎస్సై ర్యాంకు కంటే కిందిస్థాయి వారిది దారుణమైన పరిస్థితి. దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు.
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకునేది ఎట్టా?
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కఠినంగా వ్యవహరిస్తుండటంతో పోలీస్ వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. వచ్చే వేతనం నెలారంభంలోనే ఖర్చవుతుండటంతో మిగతా రోజులు గడిచేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఎందరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకునేది ఎట్ల అని దీనంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్.. మానవీయ కోణంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న ‘వారాంతపు సెలవు’ను మంజూరు చేయాలని, ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు కల్పించాలని, పోలీసు ఆరోగ్య భద్రతా కార్డుపై చికిత్సలు వెంటనే చేసేందుకు దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.