వేములవాడ: వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం 8 కోడెలు మృతిచెందగా, శనివారం మరో 5 కోడెలు మృత్యువాతపడ్డాయి. దీంతో మృతిచెందిన మొక్కు కోడెల సంఖ్య 13కు చేరింది. కాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో గోశాలకు వచ్చిన వైద్య అధికారులు.. పశువైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. జీవాల మృతికి కారణాలను విశ్లేషించడంతోపాటు అనారోగ్యంగా ఉన్నవాటికి వైద్యం అందిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా రైతులకు కోడెల పంపిణీని అధికారులు నిలిపివేశారు. దీంతో గోశాలలో సామర్థ్యానికంటే కోడెలు ఎక్కువయ్యాయి.
రాజన్న భక్తులు కోరిన కోరెలు తీరితే స్వామివారికి నిజ కోడెను సమర్పించుకుంటామని మొకుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భక్తులు కోడెలను తీసుకువచ్చి రాజన్న ఆలయానికి అప్పగిస్తుండగా, వాటిని అధికారులు తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తుంటారు. రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలను అవసరమైన రైతులకు కొన్నేండ్లుగా అందజేస్తూ వస్తున్నారు. ఆరు నెలల క్రితం కోడెల పంపిణీలో అవకతవకలు జరగడం, ఒకే వ్యక్తికి 60 జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో గోశాలకు భక్తులు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, గోశాల ఇరుగ్గా మారిపోయింది.
ఇక్కడ 400 నుంచి 500 కోడెలను సంరక్షించే స్థలం, అందుకు తగ్గట్టుగానే వసతులు ఉండగా, ప్రస్తుతం 1,250కిపైగా కోడెలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. పరిమితికి మించి రాజన్న కోడలు సంరక్షిస్తుండటంతో తరచూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇటీవల వర్షాలతో గోశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు, మోతాదుకు తగ్గట్టుగా పశుగ్రాసం అందకపోవడంతో నీరసించి మృతిచెందుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. నిత్యం 400 కోడెలకు మాత్రమే పచ్చి గడ్డిని అందిస్తున్నట్టు తెలుస్తుండగా, అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోశాలలో రోజూ పదుల సంఖ్యలో కోడెలు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు.