Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు. ఆ మోసగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అందించి సహకరించిన నలుగురు వ్యక్తులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు ‘స్టాక్ మార్కెట్లో లాభదాయకమైన రాబడి’ అనే ప్రకటనలు చూశాడు. స్టాక్స్‌పై కొంత అవగాహన ఉన్న అతను ఈ ఏడాది మే నెలలో ‘ఏ117 ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయబడ్డాడు. దీంతో జూలైలో లిస్ట్ అయ్యే ఐపీవోల్లో పెట్టుబడి పెట్టాలని ఆ గ్రూప్ అడ్మిన్ అంకుర్ కేడియా చెప్పాడు. అతని సూచనల మేరకు బాధితుడు విడతలవారీగా వివిధ ఖాతాలకు రూ.5.27,69,000 బదిలీ చేశాడు. ఆరంభంలో ఆ డబ్బు రెట్టింపు వచ్చినట్టు మోసగాళ్లు చూపినప్పటికీ అందులో బాధితుడు రూ.45 వేలు మాత్రమే విత్‌డ్రా చేయగలిగాడు.
దీంతో మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతను డబ్బు పంపిన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. అవి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రామన్ మురళీ కృష్ణన్, సామినేని మాధవరావుకు చెందినవని వెల్లడైంది. కమీషన్ కోసం వారితో రవీందర్‌రెడ్డి, రవి అనే వ్యక్తులు 14 కరెంట్ ఖాతాలను తెరిపించారని, వాటిలో రెండు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 51 సైబర్ నేరాలకు పాల్పడ్డారని తేలడంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 చెక్‌బుక్‌లు, 23 సిమ్‌కార్డులు, 10 ఏటీఎం కార్డులు, 1 స్వైపింగ్ మెషీన్, 3 ల్యాప్‌టాప్‌లు, రబ్బర్‌స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో కీలకపాత్ర పోషించిన మరో వ్యక్తి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుల అరెస్టులో ముఖ్యపాత్ర పోషించిన ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుళ్లు ఎస్ ప్రవీణ్, క్రాంతి కుమార్, శివ బృందాన్ని డీజీ శిఖాగోయెల్ అభినందించారు.