హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో మంగళవారం జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు, ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులపై తమ లాఠీలను ప్రయోగించారు. దీంతో ఆ పార్టీ నేతలు పలు చోట్ల ఆందోళనకు దిగారు. ఈ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పెంచినా ఆశించిన స్థాయిలో ఓటర్లు కేంద్రాల వద్దకు తరలిరాలేదు.
రాత్రి 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు 48.47 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుది పోలింగ్ శాతం బుధవారం వెలువడే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47.49 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నిక పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. దేశంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రాలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టిన విధానంపై ఎంతో గొప్పగా చెప్పిన అధికారులు…ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు. డబ్బుల పంపిణీ మొదలు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టలేకపోయారు. దాదాపు 11 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచారు. స్ట్రాంగ్ రూము వద్ద మూడంచెల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నెల 14న శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.