హైదరాబాద్/పెన్పహడ్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ఏటా అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఒక్కరే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సారి దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. రాష్ట్రం నుంచి 150 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, పవిత్ర ఒక్కరే అవార్డు దక్కించుకున్నారు. పవిత్ర సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
2023 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కూడా ఆమె అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పవిత్ర అవార్డు స్వీకరిస్తారు. అవార్డు గ్రహీతకు జాతీయ అవార్డుతోపాటు సిల్వర్ మెడల్, రూ. 50 వేల నగదు అందజేస్తారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, అవార్డు గ్రహీత మారం పవిత్రను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. పవిత్ర మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏకైక కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.