హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.4,495 కోట్ల పనులు దక్కించుకున్నది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.2,451 కోట్ల పనులు దక్కించుకోగా, ఏపీఈపీడీసీఎల్ నుంచి 2,043 కోట్ల పనులు చేపట్టింది. ఎస్పీడీసీఎల్ తరఫున నెల్లూరు, తిరుపతిలో, ఈపీడీసీఎల్ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు మరో ఐదు జిల్లాల్లో కేబుల్ పనులు చేయాల్సి ఉన్నది. ఈ పనులకు సంబంధించి రెండు సంస్థల నుంచి మొత్తం రూ.217.71 కోట్ల మేర అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు తెలిసింది. దీనికితోడు ఇప్పటివరకు ఏపీఎస్పీడీసీఎల్ నుంచి రూ.60.82 కోట్లు, ఈపీడీసీఎల్ నుంచి రూ.75.54 కోట్ల మేర బిల్లులు మంజూరయ్యాయి. ఈ పనులకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. టెండర్లు దక్కించుకోవడమే తప్ప పనులు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్కు నోటీసులు జారీచేసింది. విశాఖపట్నంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భంలో విద్యుత్తు లైన్లు వేసే కాంట్రాక్టును దక్కించుకొని ఏడాది గడిచినా పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
2022లో పనులు అప్పగించినా ఇంకా ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మొదలుపెట్టకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికితోడు ఎగ్జిం బ్యాంకు నుంచి గ్యారెంటీ పొందడంపై తాజా వివాదం మొదలైంది. నెల్లూరు జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన రూ.800 కోట్ల పనులకు వెస్టిండీస్‌కు చెందిన ఎగ్జింబ్యాంకు నుంచి రూ. 80 కోట్ల బ్యాంకు గ్యారెంటీ సమర్పించారు. దేశంలోనే ఒక్క శాఖ కూడా లేని బ్యాంకు నుంచి గ్యారెంటీ ఎలా తెస్తారన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎగ్జింబ్యాంకు పూర్వాపరాలను వెలికి తీస్తున్నారు. దేశంలో ఈ బ్యాంకుకు ఒక్క లావాదేవీ కూడా లేకపోవడం అందరినీ నివ్వెరపరుస్తున్నది. సాధారణంగా బ్యాంకులు ప్రతి ఏటా తమ లాభనష్టాలను ప్రకటిస్తుంటాయి. కానీ, ఈ బ్యాంకు వివరాలు ఎక్కడా లేవు. 2021 ఏప్రిల్ నాటికి తమ సంస్థ విలువ 227 మిలియన్ డాలర్లు అని ఒకసారి, మరోసారి 230 మిలియన్ డాలర్లు అని బ్యాంకు ప్రకటించడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జింబ్యాంకు ఏపీలో మొత్తం 31 ప్రాజెక్టులకు గ్యారెంటీ ఇచ్చిందని, వీటి విలువ రూ.481 కోట్లని చెప్తున్నారు.