నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 2 : కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. శుక్రవారం జూరాలకు 2.95 లక్షల క్యూసెక్కులు చేరగా.. 41 గేట్లు ఎత్తి దిగువకు 2,95,878 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 4,42,977 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 10 గేట్లను ఎత్తి 4,66,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్‌గేట్ల లెవల్ 551.30అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 39 అడుగులు మాత్రమే ఉండగా, రోజుకు 10 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరుతుండటంతో నిండుకుండలా మారుతున్నది. ప్రస్తుతం సాగర్‌కు 4,89,361 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 31,864 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 53 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా జయశంకర్ భూపాలపల్లి మండలంలోని మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం తగ్గుతున్నది. శుక్రవారం 3,30,830 క్యూసెక్కులు రాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బరాజ్‌కు 5,48,260 క్యూసెక్కుల వరద వస్తున్నది.
ఎస్సారార్ @ 12 టీఎంసీలు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో గత నెల 27 నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలతో ఎస్సారార్(మధ్యమానేరు)సగానికి చేరువైంది. 27.54 టీఎంసీలకు ప్రస్తుతం 12.326 టీఎంసీలు నిల్వ ఉండగా, 14,440 క్యూసెక్కుల వరద వస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్‌హౌస్ నుంచి శుక్రవారం 4 మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడి నాలుగు బాహుబలి మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. గ్రావిటీ కాల్వ ద్వారా 99వ కిలోమీటర్ మైలురాయి వద్ద కలుస్తున్నాయి. అక్కడి నుంచి మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి.