హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లతో 42,063 కేసులు పరిషారమయ్యాయి. జరిమానా విధించదగ్గ క్రిమినల్ కేసులు 37 వేలకుపైగా, చెల్లని చెకుల కేసులు 3217, ఇతర కేసులు 1889 చొప్పున పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ సూచనలతో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ శ్యాంకోశీ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించినట్టు న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరీ వెల్లడించారు.
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కే లక్ష్మణ్ సూచనలతో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో హైకోర్టులో 25 కేసులు పరిసారమైనట్టు కార్యదర్శి ఎం శాంతివర్ధని తెలిపారు. మోటార్ వాహనాల చట్టం కింద 17, కార్మిక పరిహారం కేసులు 2, సర్వీసు వివాదాలకు చెందిన 6 పిటిషన్లు పరిషారమయ్యాయి. రూ.88.58 లక్షల పరిహారం లబ్ధిదారులకు అందింది. 60 మంది లబ్ధి పొందారు. ప్రత్యేక లోక్‌అదాలత్ బెంచ్‌లో జస్టిన్ బీఆర్ మధుసూదన్‌రావు పిటిషన్లను విచారించి పరిషరించారు.