హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఏ విధంగా ఇస్తారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఒక దశ, దిశ లేకుండానే ముందుకెళ్తున్నదని, పూటకో మాట.. రోజుకో డ్రామా అడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. 2024 ఫిబ్రవరిలో కులగణన పేరుతో మొదలుపెట్టిన ఈ డ్రామాను ఏడాదిన్నరగా రక్తికట్టిస్తూనే ఉన్నది. రిజర్వేషన్ల కల్పన కోసం ఇప్పటికే ఐదుసార్లు మాట మార్చడం గమనార్హం. ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ సాగదీత ధోరణి అనుసరిస్తున్నది. చట్టబద్ధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే.. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం కాంగ్రెస్ సర్కారు పెద్దలకు తెలిసినప్పటికీ, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసేలా పోరాడకుండా, ఇక్కడ బిల్లులు, ఆర్డినెన్స్‌ల పేరుతో హంగామా చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ, ఏ విధంగా ఇస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతున్నది. ఒక్క బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఐదు మాటలు మార్చింది.